ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 03 August 2026, 9:32 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

వరుస ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడిన ఇద్దరు నిందితులను పట్టుకున్న వరంగల్ పోలీసులు 28 మోటార్ సైకిళ్ల స్వాధీనం వరంగల్

వరంగల్,అర్జున్ సమాచారం:
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న ద్విచక్ర వాహనాల చోరీలపై సంబంధిత పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. బైక్ చోరీలు చైన్ స్నాచింగ్ కేసులకు కూడా దారి తీస్తుండటంతో సెంట్రల్ జోన్ డీసీపీ కవిత ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్లను నియమించామని కమిషనర్ ఎన్ శ్వేత వెల్లడించారు.  సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో ప్రత్యేక దృష్టి సారించి నేర విచారణ చేయడం జరిగింది. గత కొద్ది కాలంగా జరిగిన నేరాలను విశ్లేషణ చేయగా, ఈ రోజు ఉదయం ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా బైక్ చోరీలకు సంబంధించి కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయని ఆమె అన్నారు.
నిందితులు దొంతుల ప్రశాంత్ కుమార్ (20), దుర్గం సాయి కార్తీక్ (21), సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ద్విచక్ర వాహనాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
వాహన తనిఖీల సందర్భంగా నిందితులను అదుపులోకి తీసుకుని వారినుంచి మొత్తం 28 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నాం.  వీటికి సంబంధించిన కేసులను ఆయా పోలీస్ స్టేషన్లతో అనుసంధానం చేస్తూ తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఆమె వెల్లడించారు.
నిందితులపై గతంలో కూడా పలు పోలీస్ స్టేషన్లలో ఆస్తి నేరాలకు సంబంధించిన కేసులు నమోదు అయ్యాయి. స్వాధీనం చేసుకున్న వాహనాల అసలు యజమానులను గుర్తించి, చట్టపరమైన ప్రక్రియ అనంతరం అప్పగించేందుకు చర్యలు చేపడుతున్నాం. ఇద్దరు నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీసులను కమిషనర్ అభినందించారు.  ఈ మీడియా సమావేశంలో హనుమకొండ, సిసిఎస్  ఏసీపీలు నర్సింహారావు, సదయ్య పాల్గొన్నారు.
=========================